నా భర్త నుంచి ప్రాణహాని ఉంది: నటుడు శరవణన్ మొదటి భార్య
- శరవణన్, ఆయన రెండో భార్య నుంచి ప్రాణహాని ఉందన్న తొలి భార్య సూర్యశ్రీ
- చెన్నై మౌలివాక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
- ఫ్లాట్ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను తొలగించడంపై అనుమానం
ప్రముఖ తమిళ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ శరవణన్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన మొదటి భార్య సూర్యశ్రీ చెన్నై పోలీసులను ఆశ్రయించారు. తన భర్తతో పాటు ఆయన రెండో భార్య నుంచి తనకు ముప్పు పొంచి ఉందంటూ చెన్నై శివారు ప్రాంతమైన మౌలివాక్కం పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. ఒకే అపార్ట్‌మెంట్‌లో ఎదురెదురు ఫ్లాట్లలో నివసిస్తున్న ఈ కుటుంబంలో తలెత్తిన తాజా వివాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
నటుడు శరవణన్ మొదట సూర్యశ్రీని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2019లో ఆయన శ్రీదేవి అనే మరో మహిళను రెండో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరంతా మౌలివాక్కంలోని ఒకే అపార్ట్‌మెంట్‌లో ఎదురెదురు ఫ్లాట్లలో నివసిస్తున్నారు. ఒక ఫ్లాట్‌లో శరవణన్ - శ్రీదేవి దంపతులు ఉండగా, దానికి ఎదురుగా ఉన్న మరో ఫ్లాట్‌లో మొదటి భార్య సూర్యశ్రీ ఒంటరిగా ఉంటున్నారు.
ఇటీవల సూర్యశ్రీ ఉంటున్న ఫ్లాట్ పరిసరాల్లో భద్రత కోసం అమర్చిన సీసీటీవీ కెమెరాలను కొందరు బలవంతంగా తొలగించారు. ఈ పరిణామంపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తనపై దాడి చేసేందుకే ప్లాన్ ప్రకారం ఆ కెమెరాలను తొలగించారని సూర్యశ్రీ ఆరోపించారు. తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని, తొలగించిన సీసీటీవీ కెమెరాలను తిరిగి అదే స్థానంలో అమర్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె మౌలివాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గతంలోనూ శరవణన్‌పై సూర్యశ్రీ పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ వివాహ బంధానికి చట్టపరంగా విడాకుల ప్రక్రియ పూర్తి కాకముందే శరవణన్ రెండో పెళ్లి చేసుకున్నారని, అందువల్ల ఆ వివాహం లీగల్‌గా చెల్లుబాటు కాదని ఆమె స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే కోర్టులో న్యాయపోరాటం జరుగుతోందని పేర్కొన్నారు. కాగా, మొదటి భార్య చేసిన ఈ తాజా క్రిమినల్ ఆరోపణలపై నటుడు శరవణన్ ఇప్పటివరకు స్పందించలేదు. సూర్యశ్రీ ఫిర్యాదును స్వీకరించిన మౌలివాక్కం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.